విస్తృత ధర్మాసనానికి.. శబరిమల తీర్పు బదిలీ


– శబరిమలపై ఇంకా చర్చ జరగాలన్న సీజేఐ గొగొయ్‌
న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనంసాక్షి)  : శబరిమల  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలని దాఖలైన పిటీషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. కాగా ఈ తీర్పును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవిూక్షించాలని కోరుతూ ట్రావెన్‌కోర్‌ దేవసోం బోర్డు, నాయర్‌ సర్వీసెస్‌ సొసైటీ, దేవస్థాన తంత్రులు, పలువురు భక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ వేసింది. పలువురు దాఖలు చేసిన దాదాపు 65పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. దేశంలోని ప్రతిఒక్కరికి మతస్వేచ్ఛ ఉందని తీర్పు సందర్భంగా సీజేఐ రంజన్‌ గొగొయ్‌ తెలిపారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఒకే మతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ప్రార్థనా స్థలాలలో మహిళల ప్రవేశం ఈ ఆలయానికి మాత్రమే పరిమితం కాదని, మసీదులలోకి మహిళల ప్రవేశం కూడా ఇందులో ఉందన్నారు. తీర్పుపై ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, శబరిమలపై ఇంకా మరింత చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో టెంపుల్‌లో అన్ని వయసుల మహిళలను ప్రవేశపెట్టడానికి అనుమతించే తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన సవిూక్ష పిటిషన్లను 3.2 మెజార్టీతో ఏడుగురు సభ్యుల విసృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు  ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం పిటిషన్లు పెండింగ్‌లో ఉంటాయని, విస్తృత ధర్మాసనం తదుపరి విచారణ చేపడుతుందని చీఫ్‌ జస్టిస్‌ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బెంచీలో జడ్జిలు నారిమన్‌, చంద్రచూడ్‌ బదిలీ చేయడాన్ని విభేదించారు. మెజార్టీ తీర్పుతో మత విశ్వాసాలను తక్కువ చేయడం తగదని జస్టిస్‌ నారిమన్‌ అన్నారు.
శబరిమల వివాదం ఇదీ..
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈ నాటిది కాదు. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు- కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. దీనిపై హింసాత్మక నిరసనలు కొనసాగాయి. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న భాజపా- శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దాన్ని నిలువరించేందుకు లెప్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రయత్నించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది. ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లగలిగారు. కోర్టు తీర్పును శిరసావహించి, ఆలయంలోకి వెళ్లే మహిళలకు భద్రత కల్పించినందుకు కేరళలోని పినరయి విజయన్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం విమర్శల్నీ ఎదుర్కొంది. నాటి తీర్పుపై పునస్సవిూక్ష కోరుతూ దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఉదయం తీర్పు వెలువరించింది.