వీధిగోవుల రక్షణకు చర్యలు

అధికారులకు సిఎం యోగి ఆదేశాలు
లక్నో,జనవరి3(జ‌నంసాక్షి):  వీధి గోవులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగాఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని గోశాలలకు తరలించి రక్షణ కల్పించాలని అన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన డిస్టిక్ట్‌ మెజిస్టేట్‌లతో మాట్లాడుతూ వీధి గోవుల యజమానులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని, ఇటువంటి గోవులను జనవరి 10లోగా గోశాలలకు తరలించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి తమ ఆవులను గోశాలలో విడిచిపెట్టాలకుంటే అతనికి జరిమానా విధించాలన్నారు. గోవులకు నీరు, మేత, రక్షణ కల్పించాలన్నారు. అలాగే ‘గో కల్యాణ్‌ సెస్‌’ అమలు చేసి గోశాలల అభివృద్ధికి వినియోగించాలన్నారు. ప్రతీ జిల్లాలో గోశాలలను నిర్మించి వెయ్యి గోవులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే వందకోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. గోవులను నడివీధిలో వదిలేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.