వృద్దిరేటు మందగమనం దేనికి సంకేతం?
ఆందోళన కలిగిస్తున్న ఆర్‌బిఐ వివరాలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్5(జనం సాక్షి ): దేశానికి ఉజ్వల ఆర్థిక భవితను, 5 ట్రిలియన్ డాలర్ల బలమైన వ్యవస్థను వాగ్దానం చేస్తున్న పాలకులు ఈ పతన వేగాన్నైనా ఎందుకు ఆపలేకపోతున్నారు. వృద్ధి రేటు తగ్గిందంటే ఆయా రంగాల్లో డిమాండ్ కూడా ఆ మేరకు పడిపోయిందని అర్థం.గత ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇదే అత్యంత పతన జిడిపి రేటు కావడం గమనించవలసిన అంశం. అంతకు ముందరి తైమ్రాసికం (2019 జనవరి మార్చి) లో 5.8 శాతంగా నమోదయిన వృద్ధి రేటు ఉన్నపళంగా పాయింట్ 8 శాతం పడిపోయింది. మార్కెట్ నిపుణులు కూడా ఇంత భారీ పతనాన్ని ఊహించలేదు. వృద్ధి రేటు 5.7 శాతం వద్ద నిలబడుతుందని వారు వేసిన అంచనా కూడా రుజువు కాలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల కాలంతో పోల్చుకుంటే తయారీ రంగం వృద్ధి రేటు భారీగా 12 శాతం పడిపోయింది. గత ఏడాది తొలి తైమ్రాసికంలో అది 12.1 శాతంగా నమోదయింది. ఈ ఏప్రిల్ జూన్‌లో కేవలం 0.6 శాతం
రికార్డయింది. పేదలు ఉపాధి లేక తిన తిండి కరవై అల్లాడుతుంటే ధనికులు సునాయాస మార్గాల్లో బ్యాంకులను దోచుకుని కోట్లకు పడగెత్తుతున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో బ్యాంకుల యాజమాన్యాలు చూపిస్తున్న చొరవ దాదాపు లేదనే చెప్పాలి. ఒక బ్యాంకు మోసం జరిగిన తర్వాత దానిని కనుగోడానికి సగటున 22 మాసాల వ్యవధి పడుతున్నదని ఆర్‌బిఐ నివేదిక లెక్కకట్టి చెప్పింది. దీనిని బట్టి తమ కాళ్ల కింద తవ్వుతున్న గోతులను గమనించడంలో కూడా మన బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంత మొద్దు నిద్రను, ప్రమత్తతను చిత్తగిస్తున్నాయో అర్థమవుతున్నది. ఇంటర్‌నెట్ బ్యాంకు మోసాలు 0.3 శాతం మాత్రమేనని రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడించింది, బ్యాంకుల మేనేజర్లు తదితర పర్యవేక్షక సిబ్బంది రుణగ్రహీతలతో కుమ్మక్కయ్యో, వారి వల్ల మోసపోయో జరుగుతున్న కేసులే ఎక్కువని స్పష్టపడుతున్నది. తయారీరంగ కంపెనీలలో అమ్మకాల పతనం మొత్తం ఆర్థిక రంగం స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నదని రిజర్వు బ్యాంకు నివేదిక అభిప్రాయపడింది. ఈ తైమ్రాసికంలో మోటారు సైకిళ్ల విక్రయాలు 8.8 శాతం తగ్గగా ట్రాక్టర్ల అమ్మకాలు 14.1 శాతం పడిపోయాయి. అదే సమయంలో మన ఎగుమతి దిగుమతి రంగాలూ అధోగతి పట్టాయని స్పష్టం చేసింది. ఇన్ని విధాల పతన ముఖంగా సాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులలో మోసాల కిమ్మత్తు అసాధారణంగా పెరిగిపోడం మృత్యుఘాతం వంటిది. ఏమేమి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారోగాని ఈ దుస్థితిని అరికట్టలేకపోతే ఇతరత్రా ఎన్నెన్ని గొప్పలు చెప్పుకున్నా అవి గాలి తీసిన బంతినే తలపిస్తాయి.



