వైసీపీ లాలూచీ రాజకీయాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లండి

 

– అక్రమాస్తుల కోసమే మోడీ, కేసీఆర్‌లతో జగన్‌ దోస్తీ

– ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదు.. అదో శూన్య ఫ్రంట్‌

– మోదీకి మద్దతు కోసమే ఈ ఫ్రంట్‌ తయారైంది

– జగన్‌, కేసీఆర్‌ మినహా భాజపా వ్యతిరేఖ పార్టీలు కోల్‌కత్తా ర్యాలీకి హాజరయ్యారు

– ఎన్నికల్లో 25ఎంపీ, 150అసెంబ్లీ స్థానాలే మన లక్ష్యం

– ఆమేరకు నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలి

– స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని బీజేపీ అనడం దుర్మార్గం

– 29సార్లు ఢిల్లీ వెళ్తే మొండిచెయ్యి ఇవ్వటమే.. స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌?

– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

కోల్‌కతా, నవంబర్‌19(జ‌నంసాక్షి) : అక్రమాస్తుల కేసుల నుండి బయటపడేందుకు మోదీతో ఒకపక్క, అక్రమాస్తులను కాపాడుకొనేందుకు కేసీఆర్‌తో వైసీపీ అధినేత జగన్‌ లాలూచి పడ్డారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ లాలూచి రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు. శనివారం మమత చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు కొల్‌కొత్తా వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుండి ఎలక్షన్‌ మిషన్‌ – 2019పై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నేతల ఆంధ్రా ద్వేషాన్ని ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు. కేసీఆర్‌, కవిత, కేటీఆర్‌, హరీష్‌ దుర్భాషలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వారితో అంటకాగుతున్న జగన్‌ వైఖరిని ఎండగట్టాలని తెలిపారు. వరంగల్‌లో తనపై రాళ్లేసిన వాళ్ళతో జగన్‌ లాలూచిపడ్డారని, కేసుల కోసమే మోదీతో జగన్‌ లాలూచిపడ్డారని విమర్శించారు. అలాగే అక్రమాస్తులకోసం కేసీఆర్‌తో లాలూచి పడ్డారని అన్నారు. వైసీపీ లాలూచి రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. డబ్బులు పెట్టే అభ్యర్థులను వైసీపీ వెదుకుతోందన్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రజల్లో ఉండేవారు కాదని.. డబ్బుల్లో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. డబ్బుల కోసమే వైసీపీ రాజకీయమని, డబ్బులతోనే జగన్‌ రాజకీయమని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా వైసీపీ చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్‌ మిషన్‌ – 2019 లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. 25ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయమే లక్ష్యమని స్పష్టం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమత నిర్వహిస్తున్న కోల్‌కతా ర్యాలీకి 20కిపైగా పార్టీల నాయకులు హాజరయ్యారని చంద్రబాబు తెలిపారు. జగన్‌, కేసీఆర్‌ తప్ప అందరూ కోల్‌కతా వచ్చారన్నారు. కోల్‌కతా వచ్చిన వాళ్లంతా మోదీ వ్యతిరేకులే అని దీంతో కేసీఆర్‌, జగన్‌ ఉన్నది మోదీ వెంటే అనేది సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది అసలు లేదని.. అదొక శూన్యం మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది పెద్ద సున్నా అని అన్నారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని.. అదసలు బీజేపీ ప్రతిపక్షమేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ కర్ణాటకలో దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని, జేడీఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ కుట్రలను పదిమందికి చెప్పాలన్నారు. ఏపీ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని బీజేపీ అనడం సిగ్గుచేటన్నారు. 29సార్లు ఢిల్లీ వెళ్తే మొండిచెయ్యి చూపడమే స్పెషల్‌ ట్రీట్‌మెంటా అని చంద్రబాబు ప్రశ్నించారు. పుండువిూద కారం చల్లడమేనా స్పెషల్‌ ట్రీంట్‌మెంట్‌ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలో ఆలయాల్లో అశాంతిని బీజేపీ సృష్టిస్తుందని, శబరిమలలో ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని, రామాలయాన్ని మళ్లీ తెరవిూదకు తెస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.