వ్యవసాయ రంగం.. సంక్షోభంలో కూరుకుపోయింది


– ఎరువులకోసం రైతులు రోడ్డెక్కుతున్నారు
– సిద్ధిపేటలో రైతు మరణం కలిచివేసింది
– అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు
– రైతుబంధుపై కేసీఆర్‌ చేతులెత్తేశారు?
– టీపీసీసీ రేసులో తాను లేను
– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ రైతులకు కష్టమొస్తే పట్టించుకోకపోవటం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల గురువారం జాతీయ పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు, మునిసిపల్‌ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించామని చెప్పారు. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ముందుకు మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు తగిన విధంగా సన్నద్ధమయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొనేందుకు సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని భట్టి  అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని భట్టి అన్నారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ ముందు యూరియా కోసం లైన్‌ లో రైతు నిలబడి చనిపోయిన ఘటన తనను కలిచివేసిందని చెప్పారు. సిద్దిపేట మోడల్‌ అంటూ చెప్పుకునే కేసీఆర్‌ ఈ ఘటనను చూసి సిగ్గుపడాలని అన్నారు.
యూరియా కోసం ఇంకా వేల మంది రైతులు కిలోవిూటర్ల మేర క్యూ లైన్‌లలో ఉన్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ముందుచూపు లేని రాష్ట్ర ప్రభుత్వం తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్‌ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతి లాంటి బర్నింగ్‌ అంశాలపై భవిష్యత్‌ పోరాటలపై పార్టీ నేతలతో సమావేశంలో చర్చించామని చెప్పారు. కేంద్రం ¬ంమంత్రి ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై లోతైన దర్యాప్తు చేయాలని కోరబోతున్నామని చెప్పారు. సీజన్‌ ప్రారంభమైనా కూడా రైతు బంధు పథకం ఇంకా రాలేదని భట్టి అన్నారు. ఎన్నికల వేళ రైతు బంధు పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు చేతులు ఎత్తేసిందని విమర్శించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. రైతులకు విడుదల చేయవలసిన రూ.20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని అన్నారు. డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా యూరియా దొరకని పరిస్థితి తెలంగాణలో ఉందని మల్లు భట్టి అన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుని రేసులో విూరున్నారా అని భట్టిని విలేకరుల ప్రశ్నించగా.. టీపీసీసీ అధ్యక్షుని రేసులో తాను లేనని భట్టి స్పష్టంచేశారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలనే దానిపై దృష్టి పెట్టామని చెప్పారు.