శబరిమల దర్శనానికి.. ఇద్దరు మహిళల యత్నం

 

– వారిని గుర్తించి అడ్డుకున్న భక్తులు

– మహిళలను వెనక్కి పంపించిన పోలీసులు

తిరువనంతపురం, జనవరి19(జ‌నంసాక్షి) : 50యేళ్ల లోపు మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చని సుప్రింకోర్టు తీర్పునివ్వడంతో ఆలయంలోకి ప్రవేశించేందుకు పలువురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల 50ఏళ్లలోపు వయసు గల ఇద్దరు మహిళలు మగవేషంలో వెళ్లి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ మరోసారి ఆలయానికి వెళ్లేందుకు యత్నించారు. అయితే ఈసారి కూడా భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు ఆ మహిళలను వెనక్కి పంపించారు. శనివారం ఉదయం షానిలా సతీశ్‌, రేష్మా నిషాంత్‌ అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు నీలక్కల్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. అయితే అక్కడ వీరిని ఆందోళనకారులు గుర్తించి అడ్డుకున్నారు. తమకు భద్రత కల్పించాలని వీరు పోలీసులను కోరారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తాము భద్రత కల్పించలేమని వెల్లడించి ఆ మహిళలను పోలీసులు బలవంతంగా వెనక్కి పంపించారు. గత బుధవారం కూడా వీరిద్దరూ అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. షానిలా, రేష్మ మరో ఏడుగురు పురుషులతో కలిసి మగవేషంలో శబరిమలకు కాలినడకన బయల్దేరారు. అయితే నీలక్కల్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకోగానే వీరిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కల్పించుకుని వారిని తిరిగి పంబ పోలీస్‌ కంట్రోల్‌ రూంకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఇప్పటిదాకా 51 మంది స్త్రీలు వెళ్లినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ సమాచారం వివాదాలకు దారితీసింది.