శబరి ఆలయం వద్ద హంగామా


మతవిశ్వాసాలు దెబ్బతీసిన రెహానా అరెస్ట్‌
కొచ్చి,నవంబర్‌27(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి గత అక్టోబర్‌లో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన మహిళా కార్యకర్త రెహనా ఫాతిమాను పట్టణంతిట్ట పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా మత విశ్వాసాలను గాయపరచారన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. కేరళ ముస్లిం జమాయత్‌ కౌన్సిల్‌ సైతం ఇటీవల ఆమెను ఇస్లాం మతం నుచి వెలివేసింది. లక్షలాది హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచినందుకే ఈ చర్య తీసుకున్నట్టు కౌన్సిల్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 18న ఫాతిమా తన కుటుంబసభ్యులతో కలిసి శబరిమల ఆలయానికి చేరుకుంది. అయితే ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఆమె సన్నిధానం చేరుకోలేకపోయారు. ఆన్‌లైన్‌లో మతవిద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేసిన ఆరోపణలకు సంబంధించి ఫాతిమాపై చర్యలు తీసుకోవాలని గత వారంలో కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 31 ఏళ్ల ఫాతిమా ఒక హిందువుతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ గతంలో పలు వివాదాలకు తావిచ్చిందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. సోషల్‌ విూడియాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న కారణంగా పదనాంతిట్ట పోలీసులు అక్టోబర్‌ 22న ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె ఫేస్‌బుక్‌ పోస్టుపై శబరిమల సంరక్షణ సమితి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత క్రమంలో ఫాతిమా ఇంటిని కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేయడం, ఇస్లాం మతం నుంచి ఆమెను ముస్లిం కౌన్సిల్‌ వెలివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2004లో మోరల్‌ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా కొచ్చిలో జరిగిన ‘కిస్‌ ఆఫ్‌ లవ్‌’ ప్రచారంలో ఫాతిమా పోల్గొంది. ముద్దుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆమె భాగస్వామి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఫాతిమా వివాదంలో చిక్కుకుంది.