శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై వసుంధర రాజె సీరియస్‌

చర్యలు తీసుకోవాలని ఇసికి వినతి
శరద్‌ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు
జైపూర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి):  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెను కించపరుస్తూ బిహార్‌ రాజకీయ నేత శరద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వ్యాఖ్యలకు నిర్ఘాంతపోయాను. అవమానంగా అనిపించింది. ఆయన మహిళలను అవమానించారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్య తీసుకోవాలి అని తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వసుంధర రాజె విూడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. ఆమె గులాబీ రంగు బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాన్ని ప్రత్యేకంగా మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు చేశారు. యువతరానికి ఆయన చూపించే మార్గం ఇదేనా? కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్‌ యాదవ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల భాజపా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే తాను కేవలం జోక్‌ చేశానంటూ శరద్‌ యాదవ్‌ తప్పించుకోజూశారు. శుక్రవారం ఉదయం ఆయన విూడయాతో మాట్లాడుతూ..’నేను జోక్‌ చేశాను. దాంట్లో కించపరిచే ఉద్దేశం ఏవిూ లేదు. ఆమెను బాధపెట్టాలన్న ఆలోచన నాకు లేదు. గతంలో నేను ఆమెను కలిసినప్పుడు ఆమె బరువు గురించి మాట్లాడాను’ అని యాదవ్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తో వచ్చిన విభేదాల కారణంగా ఆయన జేడీయూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన పార్టీ లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ అభ్యర్థుల కోసం ఆయన రాజస్థాన్‌లో ప్రచారం చేపట్టారు.