శ్రీరంగంలో వైకుంఠ ఏర్పాట్లు

చెన్నై,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులలో ఈ ద్వారం మూసి ఉంటుంది. పురాణాల ప్రకారం రంగనాథస్వామి దక్షిణ ముఖంగా నిలిచి ఉత్తర ముఖంగా ఉన్న విభీషణుడికి దర్శనమిచ్చాడని చెబుతారు. అక్కడ 20 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆచరించాల్సిన పూజా విధిని పెద్దలు సూచించారు. దాని ప్రకారం, సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించాలి. శుచిగా పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ పరమశివుని బిల్వదళాలు, శంఖం, పూలు, తులసి దళాలతో అర్చించాలి. ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్యం వైపు చూసే విధంగా దీపాలు వెలిగించాలి. ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించాలి. పూజానంతరం నేతిలో పెసరపప్పు, బియ్యం వేయించి ఉడికించిన పొంగలి నివేదన చేయాలి. ఏకాదశి వ్రత ప్రభావం వలన జన్మజన్మాంతరాల నుంచి పీడిస్తున్న బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం, సుఖ జీవన ప్రాప్తి కలుగుతాయన్నది పురాణ ప్రవచనం.