సముద్రంలో చెలరేగిన మంటలు!

Smoke rises from a fire at a ship in the Kerch Strait near Crimea January 21, 2019 in this still image taken from Reuters TV footage. REUTERS/Reuters TV

– భారత సిబ్బందితో వెళ్తున్న నౌకల్లో ప్రమాదం
– ఇంధనం మార్చుతుండగా చెలరేగిన మంటలు
– రెండు నౌకల్లో ప్రయాణిస్తున్న 11మంది మృతి
– కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో ఘటన
మాస్కో, జనవరి22(జ‌నంసాక్షి) : సముద్రంలో ఒక నౌక నుంచి మరొక నౌకలోకి ఇంధనంను మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీఅగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంతో రెండు నౌకల్లో ప్రయాణిస్తున్న భారత్‌, టర్కిష్‌, లిబయాన్‌కి చెందిన సిబ్బంది 11మంది మృతి చెందగా, మరికొందరిని రెస్క్యూ టీం రక్షించింది. ఈ ఘటన రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరుచేసే కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌, టర్కిష్‌, లిబయాన్‌ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. రష్యా నుంచి  క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రెండు నౌకలలోని సిబ్బందిలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి విూడియా వర్గాలు వెల్లడించాయి. రెండు నౌకలు టాంజానియా జెండాలతో ఉన్నాయని తెలిపాయి. అందులో ఒక నౌక సహజవాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి ట్యాంకర్‌ నౌక.  సోమవారం ఒక నౌక నుంచి మరో నౌకలోకి ఇంధనం మార్చుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన క్యాండీ అనే నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 9మంది టర్కీ పౌరులు కాగా, ఎనిమిది మంది భారతీయులు. మరో నౌక మేస్టోల్రో 15 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఏడుగురు టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు, లిబియాకు చెందిన ఒకరు ఉన్నట్లు తీర ప్రాంత రక్షకదళ అధికారులు వెల్లడించారు. ఒక నౌకలో పేలుడు సంభవించి మంటలు మరో నౌకకు విస్తరించాయని, సహాయక చర్యల కోసం సిబ్బంది వెళ్తున్నారని రష్యా తీరప్రాంత రక్షకదళ ఏజెన్సీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాదం జరగడంతో రెండు నౌకల్లోని 32 మంది సముద్రంలోకి దూకారని, వారిలో ఇప్పటి వరకూ  పన్నెండు మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి తీసుకొచ్చారని వెల్లడించారు. 11మంది చనిపోయారని, మరో 9 మంది నావికుల ఆచూకీ తెలియరాలేదని చెప్పారు. మృతుల్లో భారతీయులు ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.