సిక్కుల ఊచకోత నిందితులకు అందలం

కమల్‌నాథ్‌ ఎంపికపై మోడీ పరోక్ష విమర్శలు
చండీగఢ్‌,జనవరి3(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ అనుసరించిన ముఖ్యమంత్రుల ఎంపిక తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1984లో సిక్కుల ఊచకోత కేసులో నిందితుడైన కమల్‌నాథ్‌ను
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని పరోక్షంగా తప్పుబట్టారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. వేలాది మంది సిక్కుల హత్యాకాండలో ప్రమేయం ఉన్నవారి చరిత్రను తెలుసుకుని, అప్రమత్తంగా ఉండాలని మోదీ కోరారు. సిక్కులపై దాడుల కేసుల్లో నిందితులను రాష్టాల్ర ముఖ్యమంత్రులుగా నియమిస్తున్నవారి చరిత్రను కూడా తెలుసుకుని, జాగ్రత్తగా ఉండాలన్నారు.  కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తద్వారా కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌కు జీవిత ఖైదు పడిందని మోదీ గుర్తు చేశారు. ఒక కుటుంబం ఆదేశాల మేరకు ఈ కేసులకు సంబంధించిన ్గ/ళ్ళైను తొక్కిపెట్టేశారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వాటిని తవ్వి తీసిందన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని, దాని ఫలితాలు ప్రజల ముందు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలావుండగా 1984 సిక్కుల ఊచకోత కేసులపై ఏర్పాటైన నానావతి కమిషన్‌ తన నివేదికలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని చెప్తూ, ఉపసంహరించారు.