సిద్దూ పాక్‌ పర్యటన మరింత వివాదం

ఖలిస్తాన్‌ ఉద్యమకారుడితో వైరల్‌గా మారిన ఫోటో
న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ నడవా శంకుస్థాపన కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. నవజ్యోత్‌ పాక్‌ వెళ్లడంపైనే విమర్శలు రాగా.. ఆయనపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసలు కురిపించడం మరింత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఖలిస్థాన్‌ అనుకూల వేర్పాటువాద నేతగా పేరొందిన గోపాల్‌ సింగ్‌ చావ్లాతో నవజ్యోత్‌ కలిసి ఉన్న ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ఖలిస్థాన్‌ నేత చావ్లా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయడం  వివాదానికి దారితీసింది. దీంతో సిద్ధూపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. చావ్లాతో సిద్ధూ ఫొటోపై భాజపా తీవ్ర విమర్శలు చేస్తోంది. పాకిస్థాన్‌ నేలపై ఇలాంటి హానికరమైన వ్యూహాలను ఏమాత్రం సహించబోమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ వెల్లడించారు. అలాంటి సమావేశాలకు సిద్ధూ దూరంగా ఉండాలని తెలిపారు. బుధవారం పాక్‌లో జరిగిన కర్తార్‌పూర్‌ నడవా శంకుస్థాపన కార్యక్రమంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా కూడా ఖలిస్థాన్‌ నేత గోపాల్‌ సింగ్‌ చావ్లాతో కరచాలనం చేసి ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపినట్లు కనిపించింది. పాకిస్థాన్‌ సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి చావ్లా ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవల అతడు భారత దౌత్యాధికారులు లా¬ర్‌లోని గురుద్వారాను సందర్శించకుండా అడ్డుకున్నాడు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడు ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో కూడా సన్నిహితంగా ఉంటాడని, సయీద్‌తో ఫొటోలో కూడా కనిపించినట్లు సమాచారం. అలాంటి వ్యక్తితో సిద్ధూ కనిపించడం దుమారం రేపుతోంది.
పాకిస్థాన్‌ సరిహద్దులోని కర్తార్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గురుద్వారాను భారత్‌ నుంచి సిక్కు యాత్రికులు వెళ్లి సందర్శించేందుకు వీలుగా పంజాబ్‌లోని గురుదాస్‌ పూర్‌ నుంచి కర్తార్‌పూర్‌కు నాలుగు కిలోవిూటర్ల రహదారిని నిర్మించేందుకు ఇరువైపులా శంకుస్థాపన చేశారు.