స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనవరి18(జ‌నంసాక్షి) : దలాల్‌ స్ట్రీట్‌ ఈ వారాంతాన్ని ఫ్లాట్‌గా ముగించింది. శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ చివరిలో కాస్త కోలుకుని స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. సన్‌ ఫార్మా షేర్లు కుప్పకూలడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ కంపెనీ షేర్లు దాదాపు 11శాతం పడిపోయాయి. రిలయన్స్‌ షేర్లు దాదాపు నాలుగు శాతం లాభపడ్డాయి. ఉదయం సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభంతో 36,400 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,900 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 12.53 పాయింట్ల లాభంతో 36,386.61 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 1.80పాయింట్ల స్వల్ప లాభంతో 10,907 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ రిలయన్స్‌, విప్రో, కొటక్‌ మహీంద్రా, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, గెయిల్‌, లార్సెన్‌, హెచ్‌పీసీఎల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.12 వద్ద ట్రేడవుతోంది.