హిమాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలోని తహ్లివల్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.
మరో ఘటనలో ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలోని చంపావత్ జిల్లా సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తి గాయపడ్డారని, వారిని చంపావత్ జిల్లా దవాఖానకు తరలించామని చెప్పారు.