విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును (Goods train) మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రైలును నిలిపివేశారని, ఇంజిన్‌కు నిప్పంటించారని బాధితులు తెలిపారు. దీంతో కిరణ్టోల్ నుంచి విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.రైలింజన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి నక్సలైట్లు తమ ఉనికిని చాటుకోవడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు.