అభయ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు…
హైదరాబాద్: 22 ఏళ్ళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులకు బుధవారం ఇక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్భయ చట్టం కింద తొలి తీర్పును ఇచ్చిన రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాల సముదాయంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులకు చెరి వెయ్యి రూపాయల జరిమానా విధించింది.భారతీయ శిక్షా స్మృతిలో పలు సెక్షన్ల కింద తప్పుడు వాంగ్మూలం, అపహరణ, సామూహిక అత్యాచారం నేరాలపై వి.సతీశ్(30), ఎన్.వెంకటేశ్వర్లు(28)లను కోర్టు దోషులుగా నిర్ధారించిందని న్యాయవాది విలేకరులతో అన్నారు. ఇక్కడి హైటెక్ సిటీలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను గత సంవత్సరం అక్టోబర్ 18న ఇద్దరు కారు డ్రైవర్లు అపహరించుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డారు.పోలీసులు ‘నిర్భయ’గా నామకరణం చేసిన సదరు మహిళ హైటెక్ సిటీలోని ఒక మాల్ వద్ద షాపింగ్ చేసిన తర్వాత ఆటో రిక్షా కోసం వేచి చూస్తోంది. అప్పుడే ఒక వ్యాపారవేత్త కారు డ్రైవర్ సతీశ్ ఆమె వద్దకు వచ్చి హాస్టల్ దగ్గర దింపుతానన్నాడు. క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితుడు వెంకటేశ్వర్లు కూడా కారులో ఒక ప్రయాణికునిలా కూర్చొని ఉన్నాడు. ఆమె కారులో ఎక్కిన తర్వాత దారి మళ్ళించిన నిందితుడు కారును నగర శివార్లలో మెదక్ జిల్లాలోని కొల్లూరుకు తీసుకువెళ్ళాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని ఆమె హాస్టల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు.కాగా కేసును ఛేదించడం కోసం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఎఐ) సాయాన్ని పోలీసులు తీసుకున్నారు. కేసు సత్వర విచారణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జనవరి మాసంలో ఒక చార్జ్ షీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ శాస్త్రీయ ఆధారంతో పాటుగా 21 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టింది.