51మంది మహిళలు.. అయ్యప్పను దర్శించుకున్నారు

 

– సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం, జనవరి18(జ‌నంసాక్షి) : శమరిమలలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రింకోర్టు తీర్పు వెల్లడించిన విషయం విధితమే. కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయంలోకి 51మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వారందరూ 50 ఏళ్ల వయసులోపు వారేనని పేర్కొంది. ఈ జాబితాను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి శుక్రవారం అందజేసింది. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టిన తొలి ఇద్దరు మహిళలు తమకు భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇప్పటివరకు ఆలయంలోకి ప్రవేశించిన మహిళల జాబితాను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసింది. దాదాపు 16లక్షల మంది భక్తులు ఆలయ ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఏడు వేల మంది మహిళలున్నారన్నారు. వారంతా పది నుంచి 50 ఏళ్ల వయసులోపు వారేనని తెలిపారు. 16లక్షల మందిలో 8.2లక్షల మంది స్వామిని దర్శించుకున్నారని, ఇక ఏడు వేల మందిలో ఆలయంలోకి ప్రవేశించింది కేవలం 51 మందేనని సుప్రింకు నివేదించింది. వీరు ప్రవేశిస్తున్నప్పుడు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని, వారు సన్నిధానం నుంచి బయటికి వచ్చాక టికెట్లకు పక్కాగా స్కాన్‌ చేసి పంపించామని తెలిపింది. మొత్తానికి 2018లో ఇప్పటివరకు అయ్యప్పను దర్శించుకున్నవారి సంఖ్య 44 లక్షలు అని ప్రకాశ్‌ అనే ప్రభుత్వాధికారి వెల్లడించారు.