రాజకీయాల నుండి నిష్క్రమణ
పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఒంగోలు/హైదరాబాద్‌్, మార్చి 7 : రాజకీయాల నుండి నిష్క్రమణ! రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో ప్రకటించారు. కుటుంబ, ఇతరత్రా కారణాల వల్ల రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్టు చెప్పారు. తాను, తన భార్య పురందరేశ్వరీలలో ఎవరో ఒక్కరే రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని, ఆ నిర్ణయం నేపథ్యంలో తాను వైదొలగాలని భావించానని అన్నారు. రాజకీయాల నుండి తప్పుకున్నప్పటికీ సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిలో మాత్రం పాలు పంచుకుంటానని తెలియజేశారు. ఇదిలా ఉండగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పర్చూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసంతృప్తికి గురైన ఆయన ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను ఉపయోగించుకుని సంచలనం సృష్టించారు. ఆయన భార్య దగ్గుబాటి పురందరేశ్వరి నేడో.. రేపో బిజెపిలో చేరబోతున్నట్టు తెలిసింది.