న్యూఢిల్లీ : దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక్క రోజు ముందు కొత్త ప్రభుత్వ రూపురేఖల ఖరారు చేస్తున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన సీనియర్ సభ్యురాలు సుమిత్రా మహజన్‌ను లోక్‌సభ సభాపతిగా నియమించాలని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు సమాచారం. 15వ లోక్‌సభలో ఉప సభాపతిగా పని చేసిన కరియా ముండా పేరు కూడా సభాపతి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇప్పటి వరకూ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ స్పీకర్ పదవి చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా మోడీ దృష్టికి తీసుకు రాలేదు. దీంతో నరేంద్ర మోడీ, సభాపతి పదవి కోసం అద్వానీ పేరును పరిగణనలో్కి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక సీనియర్ న్యాయవాదులు ఉదయ్ లలిత్, ముకుల్ రోహత్గీ అటార్నీ జనరల్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కేబినెట్‌లోకి తీసుకునే నేతల జాబితాను నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతారని తెలుస్తోంది. పార్టీ వర్గాల కథనం ప్రకారం సీనియర్లు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్‌గడ్కరీ, సుష్మా స్వరాజ్, అరుణ్‌శౌరి, రవి శంకర్ ప్రసాద్‌లకు చోటు దక్కుతుందని తెలుస్తోంది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో తెలుగుదేశం పార్టీతోపాటు శివసేన, లోక్ జనశక్తి, అకాలీదళ్ పార్టీలు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నాయి. సుపరిపాలన దిశగా కొన్ని శాఖలను ఇతర శాఖల్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేబినెట్ రూపకల్పన కోసం శనివారం నుంచి నరేంద్ర మోడీ పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడిపారు.