1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్
ఆగష్టు 22(జనం సాక్షి)హైదరాబాద్: రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించపోవడంతో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించకపోతే ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) వెల్లడించింది. ప్రభుత్వం గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌కు నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ చెప్పారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) కింద అందిస్తున్న సేవలకుగాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, దీంతో దవాఖానల నిర్వహణ కష్టంగా మారిందన్నారు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 471 ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేశ్ తెలిపారు.
కాగా, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు తన్హా గత జనవరిలో ప్రకటించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం రూ.117 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి హామీలను ప్రభుత్వం ఇచ్చింది. అనంతరం వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి.