నాడు కేసీఆర్ యూరియా తెప్పించారిలా
- ఎరువులపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్ష వీడియో వైరల్
- యూరియా తెప్పించిన తీరుపై ప్రశంసలు
- అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తీరు భేష్
- గ్రామాలకు లారీలతో సరఫరాకు సూచనలు
హైదరాబాద్, ఆగష్టు22(జనం సాక్షి) ఎరువులను తెప్పించడం కోసం నాడు కేసీఆర్ చేసిన సమీక్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమీక్షలో ఎరువులు తెప్పించేందుకు కేసీఆర్ పడిన తపన, చూపిన చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇది కదా.. రైతులపై ప్రేమంటే, ఇది కదా… ముందుచూపంటే. ఇది కదా.. నాయకుడి లక్షణమంటే’ అంటూ అభినందిస్తున్నారు. ఈ సమీక్షలో కేసీఆర్ ఎరువులను సకాలంలో రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడి.. ఎవరి బాధ్యత వారికి అప్పగిస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విదేశాల నుంచి షిప్‌ల ద్వారా వచ్చే యూరియాను వెంటనే రైళ్లు ఏర్పాటు చేసి తెలంగాణకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దక్షిణమధ్య రైల్వే అధికారులతో మాట్లాడి అవసరమైన గూడ్స్ రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దీంతో రైల్వేశాఖ ప్రత్యేకంగా 25 గూడ్స్ రైళ్లు ఏర్పాటు చేసింది. గూడ్స్ రైళ్లకు షిప్‌ల నుంచి యూరియా ఎక్కించేందుకు అవసరమైన లారీలను సమకూర్చాల్సిందిగా నాటి ఏపీ మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి మాట్లాడారు.
స్పందించిన నాని.. అవసరమైన లారీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే షిప్‌ల నుంచి సకాలంలో మనకు కేటాయించిన కోటా యూరియాను తీసుకునేందుకు ప్రతీ పోర్టుకు వ్యవసాయశాఖలోని ఒక సీనియర్ అధికారిని పంపించాలని ఆదేశించారు. ఈ విధంగా రెండు మూడు రోజుల్లోనే లక్ష టన్నుల యూరియాను రాష్ర్టానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ర్టానికి వచ్చిన యూరియాను నేరుగా గ్రామాలకు తరలించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో నాడు అధికారులు ఏకంగా 4వేల లారీలను సిద్ధం చేయడం గమనార్హం. ఈ విధంగా సకాలంలో యూరియాను తెప్పించి.. రైతులకు సరఫరా చేసి కొరత, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
యూరియా తెప్పించేందుకు కేసీఆర్ చేసిన కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేండ్లలో ఎక్కడా యూరియా కొరత అనే మాట వినిపించకుండా నాటి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. సీజన్ ప్రారంభమైందంటే ప్రతీక్షణం యూరియా నిల్వలపై సమీక్షించేవారు. సీజన్‌కు ముందే బఫర్‌స్టాక్ ఉండేలా చర్యలు తీసుకునేవారు. తద్వారా ఎక్కడా యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి ఉండడం గమనార్హం. ఎక్కడ చూసినా యూరియా కొరతే. ఒక్క బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.