ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్

 

 

 

 

ఆగస్టు 26 (జనం సాక్షి)టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన తల్లిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఎంత క‌ల‌క‌లం సృష్టించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌గ్గుబాటికి సంబంధించిన ఆడియో లీక్ కావడంతో, తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి న‌డి రోడ్డుపైకి వ‌చ్చిన తారక్ ఫ్యాన్స్ ఆందోళన బాట పట్టారు. ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్రసాద్‌పై తీవ్రంగా మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు నారా, నందమూరి కుటుంబాల నుంచి ఎవరూ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. రెండు రోజుల గడువు ఇచ్చిన కూడా , ఎవ‌రి నుండి స్పందన లేకపోవడంతో ఆదివారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించారు ఎన్టీఆర్ అభిమానులు. దీనివల్ల అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతను కల్పించారు. బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.

ఇక ఈ వివాదంపై తాజాగా నారా కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ స్పందించారు. ఆయన నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న విడుదల కాబోతుండగా, ప్రమోషన్లలో భాగంగా మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, “ఆ ఆడియో గురించి ఎక్కడో చదివాను, కానీ అసలు వినలేదు. ఈ అంశం గురించి నాకు పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాను, న్యూస్ కూడా చూడలేదు. పూర్తి వివరాలు తెలియకుండా ఏదైనా మాట్లాడటం సరైంది కాదు,” అని చెప్పారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎమ్మెల్యే ప్రసాద్‌ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన నుంచి బహిరంగ క్షమాపణ కోరుతూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ స్పందన లేకపోవడంతో, వారి ఆందోళన మరింత ఉధృతమవుతోంది.