బెంగాల్‌లో ఆగని ఘర్షణలు

– అర్థరాత్రి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
– ఇద్దరి బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు
కోల్‌కత్తా, మే21(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మగిసినప్పటికీ బెంగాల్‌లో మాత్రం ఘర్షణలు ఆగడం లేదు. మరో రెండురోజుల్లో ఫలితాలు రానుండటంతో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా బెంగాల్‌లో కూచ్‌ బిహార్‌ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కర్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా  ఉందని వైద్యులు తెలిపారు. అక్కడి ప్రాంతం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.
కాగా ఘర్షణ సమయంలో తుపాకిలు వాడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గాయపడ్డవారికి తుపాకి గుండ్లుతో గాయాలు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలైనప్పటి నుంచి ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. నువ్వానేనా అన్నట్లు సాగిన బెంగాల్‌ పోరులో.. ఫలితం ఎవరిని వరిస్తోందనని దేశమంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాల సందర్భంగా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మొహరించారు. బెంగాల్‌ వ్యాప్తంగా హింస చెలరేగే అవకాశం ఉందని.. ఇప్పటికే  పోలీసులు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలుచోట్ల మినహా కాగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తీవ్ర హింసాత్మక ఘటనలు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, వాపపక్షాల ధర్నాలు, ఆదోళనలు, ఆరోపణలతో బెంగాల్‌ రాజకీయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింస మరువక ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం సంచలనైంది. అప్పటి నుంచి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు మరింత ఎక్కువవయ్యాయి.