యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌
ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు
లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే తొక్కిసలాట జరిగిందని విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. సమాజ్‌వాదీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రతిపక్ష బీఎస్పీ సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. డెస్క్‌లపైకెక్కి గవర్నర్‌పై పేపర్లను చించివేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గవర్నర్‌కు రక్షణగా నిలిచారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మౌని అమవాస్య సందర్భంగా మహా కుంభామేళాకు లక్షలాది భక్తులు తరలిరావడంతో అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఉదంతంతో గురువారం నుంచి ప్రారంభమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను కుదిపేసింది. తొలి రోజే అసెంబ్లీ రణరంగంగా మారింది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని బీఎస్పీ, ఆర్జేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బీఎల్‌ జోషి ప్రసంగిస్తుండగా.. విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. అలహాబాద్‌ తొక్కిసలాటపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలను పునరుద్ధించాలని నినాదాలు చేశారు. డెస్క్‌లపైకెక్కి పేపర్‌ బాల్స్‌ను గవర్నర్‌పైకి విసిరారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌కు రక్షణగా నిలిచారు. ప్రసంగం మధ్యలోనే ఆపేసిన గవర్నర్‌ బయటకు వెళ్లిపోయారు. విపక్షాల ఆందోళనలో నేపథ్యంలో కొద్దిసేపు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ఆజాంఖాన్‌ విపక్షాల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో గూండాలకు అవకాశం లేదని విపక్ష సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. బీజేపీ సభ్యులు తొలిరోజు సమావేశాలకు గైర్హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు.