రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా

 రాష్ట్రంలో 24లక్షల కనెక్షన్లకు విద్యుత్‌ అందిస్తాం

– ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకంగా విద్యుత్‌సరఫరా చేస్తాం
– లోపాలుంటే సరిచేసుకొని మళ్లీ సరఫరా కొనసాగిస్తాం
– శాసన మండలిలో.. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగుతోందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యుత్‌ సరఫరాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సోమవారం రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 24 లక్షల కనెక్షన్లకు 24 గంటల కరెంట్‌ ఇస్తామన్నారు. ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల విద్యుత్‌ సరఫరా జరిగిందన్నారు. ఇకపై రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే మరమ్మతులకు సమయం పట్టేదన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయట్లేదని ఆందోళనలు జరిగేవని గుర్తు చేశారు. దీంతో రైతులకు ఎంతో పంట నష్టం జరిగేదన్నారు. కానీ తమ ప్రభుత్వం.. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఆధునీకరించామని చెప్పారు. ఇప్పుడు సమస్య తలెత్తితే 24 గంటల్లోనే ట్రాన్స్‌ఫార్మర్లను మారుస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫలాల్యలు 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలకు అదనపు విద్యుత్‌ సరఫరా అవసరం అవుతుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విద్యుత్‌ సమస్ప ఉత్పన్నం కాదన్నారు. రెప్పపాటు కరెంట్‌ పోకుండా సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్‌ సరఫరా గణనీయంగా పెరగడంతో.. రైతులు, పారిశ్రామిక కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. డిస్కంలకు మొబైల్‌యాప్‌లను డెవలప్‌ చేశామన్నారు. విద్యుత్‌ సంస్థలో ఉద్యోగ నియామకాలు
చేపట్టామని తెలిపారు. 13 వేలకు పైగా కొత్త పోస్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. కరెంట్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై ఎప్పటికప్పుడు సవిూక్షించుకుంటూ.. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.