రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 7 :  రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అపాయింటెడ్‌ డేపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. జస్టిస్‌ దత్తు, జస్టిస్‌ బోత్‌డేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో విభజనపై స్టే ఇవ్వలేమంది. రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించాలని కోరుతూ రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే విభజనపై కేంద్రం అనుసరించిన విధానాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 2వ తేదీలోపు మళ్లీ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేవనేది తెలంగాణ వాదుల అభిప్రాయం కాగా, సుప్రీంకోర్టులో తమ వాదన నెగ్గుతుందని, విభజన ఆగుతుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ వ్యాఖ్యానించారు. కోర్టులో కేసు వేసిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలపై కచ్చితంగా స్పందిస్తుందని, రాష్ట్ర విభజనను నిలుపుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.