కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం చేస్తున్న వివాహేతర బంధాలు
హత్యలతో అనాధలవుతున్న చిన్నారులు
హైదరాబాద్,ఆగస్ట్9(జనం సాక్షి ): మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. కాపురాలు జైలుకెళ్లి చస్తున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ అక్రమ సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది.తాజాగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో జరిగిన హత్య వెనక కూడా భార్యకు ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. సమాజం అల్లోకల్లం అవుతున్నదనడానికి ఇంతకన్నా దాఖలాలు లేవు. భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుందామని బలవంతం చేయడంతో హత్య చేశానంటూ భార్య చెప్పిన మాటలు 24 గంటల్లో అబద్దాలని తేలింది. హైదరాబాద్ ఫిలింనగర్లో భార్య చేతిలో దారుణహత్యకు గురైన బోనోత్ జగన్నాయక్ హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. రెండేండ్లుగా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం భర్తకు తెలిసిపోవడం వల్లే భర్తను హత్యచేసినట్టు నిందితురాలు దేవిక అంగీకరించింది. రెండేండ్ల కిందట ఫిలింనగర్‌లోని అడ్వాన్స్సాఫ్ట్ సంస్థలో హౌజ్‌కీపింగ్ పనిలోచేరిన దేవికకు అక్కడే పనిచేస్తున్న కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జీ(32)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన దేవిక భర్త జగన్, ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించారు. తోట బెనర్జీపై కూడా చేయిచేసుకున్నారు. అయినా వారు పద్ధతి మార్చుకోక పోవడంతో జగన్ పంచాయితీ పెట్టాడు. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో కాపురం చేసేందుకు అంగీకరించాడు. దేవిక మాత్రం ప్రియుడు బెనర్జీని ఏకంగా తన ఇంటిపై ఉన్న పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉండేలా చేసింది. అంతేనా అంటే భర్తను ఇద్దరు కలసి చంపి నాటకాలాడింది. పిల్లల వాజ్ఞూలంతో వ్యవహారం బయటపడింది. భర్తలను చంపడానికి భార్యలు, భార్యలను చంపడానికి భర్తలు వెనకాడడం లేదు.
రోజురోజుకూ సమాజంలో అ ఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అక్కర్లేదు. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి నేర ఘటన వెనక ఏదో ఒక అమానవీయ కోణం దాగివుంటోంది అది పైకి నేరంగానే కనిపిస్తున్న ఆ నేరం వెనుక మానవ సంబంధాల పగలు ప్రతికారాలు దాగివుంటున్నాయి. ఇందుకు నిదర్శనమే ఇటీవలి ఘటనలు. వరుసగా చోటు చేసుకుంటున్న నేర ఘటనలు వివాహేతర సంబంధాలతో ప్రాణాలు తీసుకున్న ఘటనలే. వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్నాయని చెప్పడానికి ఈ ఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తుల మధ్య ఆకర్షణో… ప్రేమో, .. బలహీనతలో… ఆసరానో తెలియదు కాని వివాహేతర సంబంధాలు మాత్రం వ్యక్తుల మధ్య ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. పరిచయాలు… వ్యక్తుల మధ్య చనువు… చివరకు ఇద్దరిని దగ్గరకు చేరేలా చేస్తున్నాయి. వెంటనే హత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా వివాహేతర సంబంధాలు జరుగుతన్నాయి. అక్రమ బంధాలను జీర్ణించుకోలేని వ్యక్తులు ఎక్కువ కాలం వీటిని చూస్తూ భరించలేక చివరకు ప్రాణాలు తీసే వరకు తెగబడుతున్నారు. వివాహేతర సంబంధాలతో ప్రాణాలనే కోల్పోవాల్సిన పరిస్థితులు నేటి సమాజంలో ఏర్పడ్డాయి. పథకం ప్రకారం రప్పించి మరి హత్య చేయడం కూడా జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లోను వివాహేతర సంబంధాలే హత్యలకు పురిగోల్పుతున్నాయి. వివాహేతర సంబంధాలు ప్రాణాలను తీయడంలో వెనుకడుగు వేయడంలేదు. పరువు ప్రతిష్టలను కీలకంగా భావిస్తున్న వ్యక్తులు వివాహేతర సంబంధాలను జీర్ణించుకోలేక చివరకు తమ జీవితాలను పణంగా పెట్టి ప్రాణాలను తీస్తూ జైలు పాలవుతున్నారు. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలు కలవర పాటుకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రోజుకో చోట వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న తీరు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చేలా చోటు చేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్‌పై బెంగను కలుగ జేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో పిల్లలు అనాధలుగా మారుతున్నారు. మానవసంబధాలపై అవగాహన లేకపోవడం, కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడం, పనుల కోసం స్త్రీలు కాలు బయట పెట్టడం, ఆకర్శణలకు లోను కావడం, ఇలా అనేకానేక కారనాలు దోహదపడుతున్నాయి.




