Sunday, 22 November 2026

ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా శీలం సింధు జన్మదిన వేడుకలు

భక్తి పారవశ్యంలో దాండియా నృత్యాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: దుర్గా ఎల్లమ్మ శక్తిపీఠం ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణలు, మంగళహారతులు, భక్తుల పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గురువారం నిర్వహించిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.

పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, ముందుగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన దాండియా నృత్యాల్లో రంగురంగుల వస్త్రధారణతో మహిళలు ఉత్సాహంగా అడుగులు వేస్తూ సందడి చేశారు. సంగీతం, లయబద్ధమైన నృత్యాలు, అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. బిహెచ్ఎల్ కాలనీలోని సుచిత్ర సర్కిల్ ఆల్వాల్లో జరిగిన ఈ కార్యక్రమం, భక్తుల ఆనందోత్సాహాల మధ్య దాండియా వేడుకలు కన్నులపండువగా సాగాయి.

ఇదే సందర్భంగా శీలం సింధు జన్మదిన వేడుకలను కూడా వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జయశ్రీ అమ్మవారు భక్తులకు దుర్గాదేవి ఆశీస్సులు అందజేస్తూ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అమ్మవారి కృపతో సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో అందరూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.