– లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి
– అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
– రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై సీఎం కేసీఆర్ సవిూక్ష
– వర్షాల కారణంగా టీఆర్‌ఎస్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు16(జనం సాక్షి) : రాష్ట్రంలో భారీ వర్షాలు కురి సే అవకాశాలు ఉన్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావంపై సీఎం కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో సీఎం మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులు, పోలీసుల సహాకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి. సెక్రటరియేట్‌లో సీనియర్ అధికారి నాయకత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలి. ప్రజలు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య ప్రజాప్రతినిధులు స్థానికంగా అందుబాటులో ఉండాల్సి ఉన్నందున శుక్రవారం జరిగే పార్టీ సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన తరువాత సమావేశం ఉంటుంది. త్వరలోనే తేదిని ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి హరీష్‌రావు
రానున్న 48గంటల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో చేరే వరద నీటి పై ఎప్పటికప్పుడు సాగు నీటి శాఖ ప్రధాన కార్యాలయానిక్ సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎస్‌ఈలు, సీఈలు గంటగంటకు రిజర్వాయర్ల పరిస్థితిని సవిూక్షించాలన్నారు. గంట గంటకు వరద నీటి ప్రవాహ వివరాలను ఫ్లడ్ కంట్రోల్ రూంకు చేరవేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంటే వెంటనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామునుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు తెలంగాణ ప్రాజెక్టుల్లోకి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.




