Monday, 2 November 2026

అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌2(జ‌నంసాక్షి): గతేడాది కొత్తగా ఏర్పడ్డ భద్రాద్దరికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి కార్యకలాపాలను కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు వరుసగా సవిూక్షిస్తున్నారు. హరితాహారం కార్యక్రమంతో అటవీసంపదను పెంచుకునేందుకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, పీహెచ్‌సీలు పచ్చదనంతో పరిఢవిల్లాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు ఆదేశించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ఉద్ధృతంగా కొనసాగించాలన్నారు.అందుకు అవసరమైన అటవీశాఖ, నర్సరీలతో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారులు సవిూక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.యువజన, మహిళా సంఘాల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపోతే కొత్తగూడెం మార్కెట్‌ యార్డులో ప్రత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మకాలు సాగించాలని రైతులకు సూచిస్తున్నారు. దశారులను నమ్మి మోసపోవద్దని తమ ఉత్పత్తులను కొత్తగూడెం మార్కెట్‌ యార్డుకు తేవడం ద్వారా మద్దతు ధర పొందవచ్చని కొత్తగూడెం పరిధిలో ఉన్న మండలాల రైతులకు సూచించారు. ఆయా ఉత్పత్తులకు మద్దతు ధర లేని సమయంలో మార్కెట్‌ యార్డు గోదాముల్లో నిల్వ ఉంచుకొనే సదుపాయముందని, అంతేకాక ఆయా ఉత్పత్తులను నిల్వ ఉంచడం ద్వారా రైతుబంధు పథకం కింద అధికంగా రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చని, ఈ రుణంపై 6 నెలల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదని, ఆరు నెలల తరువాత నామమాత్ర వడ్డీ ఉంటుందని తెలిపారు. భద్రాద్రి జిల్లా ఆవిర్భావం అనంతరం కొత్తగూడెం మార్కెట్‌ యార్డులో పలు మార్పులు చోటుచేసుకోనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం చండ్రుగొండ, పాల్వంచ మండలాలు ఇప్పటిరవకు కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ పరిధిలో ఉన్నాయని, నూతనంగా చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, జూలూరుపాడు మండలాలు కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ పరిధిలోనికి కొత్తగా చేరనున్నట్లు తెలిపారు.