దేశహితం కోరి పనులను చేపట్టాలి
హైదరాబాద్,డిసెంబర్25(జనంసాక్షి): ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న ఆందోళనలు, వివిధ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాలకులు ముందుకు సాగాల్సి ఉంది. ఇటీవలి ఎన్ఇనకల ఫలితాలు అందుకు కనువిప్పుకావాలి. దేశ హితం కోరి పాలకులు అడుగువేయాలి. రాజకీయాలంటే ఎదుటి వారిని ఓడించడమే లక్ష్యం కాదు. తెలంగాణలో ఫలితాలు ఓ రకంగా బిజెపికి కూడా గుణపాఠం లాంటివి. ఇక్కడ అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగడం వల్లనే కెసిఆర్ మరోమారు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రజలు ఏకపక్షంగా కెసిఒఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు. అలాగే బిజెపిని తిరస్కరించారు. రాజకీయమంటే అంకితభావంతో దేశ అభివృద్దిలో భాగస్వామ్యం కావడం. ప్రజలను దేశం కోసం ప్రభావితం చేయడం కావాలి. అభివృద్ది అన్నదే నినాదంగా రాజకీయాలు నడవాలి. అప్పుడే దేశంలో అసమానతలు తొలగిపోతాయి. అలాగే యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా అభివృద్దికి బాటలు వేయాలి. మెచ్చుకోలు ప్రసంగాలతో కాకుండా పక్కా ప్రణాళిక, అందుకు తగ్గట్లుగా కార్యాచరణ లక్ష్యంగా పాలన సాగాలి. 70 ఏళ్లు దాటినా ఇంకా ఆకలి, అవిద్య, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటికి కారణం ఎవరో పాలకులు గుండెలవిూద చేయివేసుకోవాలి. ప్రజలు ఇందుకు కారణం ఎన్నడూ కాదు. అధికారం అప్పగించినప్పుడు సరైన దారిలో పాలకులు నడవకపోవడం వల్లనే ఈ దౌర్భాగ్యం మనలను వెన్నాడుతున్నాయని గుర్తించాలి. భారతదేశంలో గ్రామస్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కన్నప్పటికి ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అర్ధ దశాబ్దం పాలించినా అది సాకారం కాలేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది. అందుకు పాలకులు నడుం బిగించాలి. ఆ దిశగా కార్యక్రమాలు చేయాలి. అయితే గ్రామాల్లో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు కనబడడం లేదు. ప్రజలు ఉపాధి కోసం గ్రామాలను వదిలి పట్టణాలకు వలసలు పోతున్నారు. దీనికి కారణం ఏంటన్నది
ఆలోచన చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేసుకోవాలంటే కఠిన శ్రమ తప్పదు. తమ కలలు, ఆకాంక్షలు, ఆదర్శాలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యం యువతలో కలిగించాలి. వారిలో నిరాశా నిస్పృహలు వస్తే దేశానికి ప్రమాదం. అలాకాకుండా వారు నిరుద్యోగులగా మిగలకుండా, కనీసం స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికను అమలు చేయాలి.అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించినా ఇప్పటికీ పౌష్టికాహారలేమి కారణంగా వ్యాధుల బారిన పడుతున్నాం. సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చేయగలగాలి. ఇదే మనముందున్న సవాల్. మన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి, దేశ భవిష్యత్తుకు ఇది చాలి ముఖ్యం. 2022 నాటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతుంది. ఇవి రెండూ ప్రత్యేక సందర్భాలు. స్వాతంత్రోద్యమ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న దేశాన్ని సాధించడానికి మనం పాటుపడదామన్న పిలుపు మేరకు పాలకులు ఇప్పటికైనా తమ పంథా మార్చుకోవాలి. ఎంతకాలం అధికారంలో ఉన్నామన్న దానికన్నా ఎన్ని మంచి పనులతో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లామన్నది లక్ష్యం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కెసిరా/- చేస్తున్న ప్రయత్నంలో అంతా కలసి వస్తే కల సాకారం కావడం ఖాయం. అందరి లక్ష్యం అభివృద్ది అయితే అందుకు ఆలోచన అసవరం లేదు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే వ్యవస్థలు చాలా ముఖ్యమనీ, ఇవి నిజాయతీతో, క్రమశిక్షణతో తమ పరిధులు గుర్తెరిగి పనిచేయాలనీ కెసిఆర్ పదేపదే గుర్తు చేస్తున్నారు. మనదేశ జనాభాలో 60 శాతం మంది వయసు 35 ఏళ్లకంటే తక్కువే ఉందనీ, మన ఆశలన్నీ వారిపైనే ఉన్నాయనీ చెప్పారు. అక్షరాస్యత పెంచడానికి చాలా కృషి జరిగిందనీ, ఇప్పుడు దాని స్థాయిని మరింత పెంచి… విద్యతో పాటు విజ్ఞానం కూడా అందరికీ చేరేలా చూడాలని తెలిపారు. డిజిటల్ ఆర్థిక రంగం, రోబోటిక్స్, యాంత్రికీకరణ యుగానికి తగ్గట్టుగా విద్యావ్యవస్థను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. వీటిని అధిగమించేలా రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా గ్రామాలను బలోపేతం చేయాల్సి ఉంది. మార్పు కోసం జరిగే ప్రయత్నం విజయవంతం కావడానికి ఇదే సరైన సమయం.




