అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు ఆయన రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఓటర్లను నమోదు చేయాలని, అదే విధంగా గత సంవత్సరం కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీల నుండి సేకరించి బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులుల్ స్వీకరించాలని, సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడంపై శ్రద్ద వహించాలని, ఇందుకు గాను అంగన్ వాడి టీచర్లను, ఆశా సిబ్బందిని వినియోగించాలని తెలిపారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, వ్యాపార సంస్థలలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని, దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ SVEEP అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామసభ సమావేశంలో SVEEP కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు, ఆశా సిబ్బంది, స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, భాస్కర్ రావు,జడ్.పి.సి.ఈ. ఓ.ప్రేమ్ కరణ్ రెడ్డి,డి.ఈ. ఓ.భిక్ష పతి, ఎన్నికల డి.టి.విజయ్,తదితరులు పాల్గొన్నారు.
.