Thursday, 5 November 2026

ఉత్కంఠగా మారిన ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ రేసు..

– ఐదింటిలో అర్హత సాధించే రెండు జట్లేవి?
– ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరిన చెన్నై, హైదరాబాద్‌
– ప్లేఆఫ్‌ కోసం మరో ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ
హైదరాబాద్‌, మే17(జ‌నం సాక్షి ) : ఐపీఎల్‌ (ఇండియాన్‌ ప్రిమియర్‌ లీగ్‌) చివరి దశకు చేరుకుంటున్నా కొద్దీ క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠతను రేపుతోంది.. ఇప్పటికే ప్లేఆఫ్‌కు హైదరాబాద్‌, చెన్నై జట్లు చేరుకోగా.. రాజస్థాన్‌, ముంబాయి, కోల్‌కతా, పంజాబ్‌, ఆర్‌సీబీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైంది. ముంబాయి కూడా దాదాపు ప్లేఆఫ్‌ చేరువైన దశలో..  బుధవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై గెలుపొందడంతో రేసు రసవత్తరంగా మారింది. ఈ విజయంతో రోహిత్‌ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. పంజాబ్‌ ఆరో స్థానానికి పడిపోయింది. ముంబైతోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌ల ఖాతాలోనూ 12పాయింట్లే ఉన్నప్పటికీ.. మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ టాప్‌-4లోకి వెళ్లింది. కోల్‌కతా జట్టు 14పాయింట్లతో మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్‌ చేరలేదు. 50మ్యాచ్‌లు పూర్తయినా.. సన్‌రైజర్స్‌, సూపర్‌ కింగ్స్‌ మాత్రమే ప్లే ఆఫ్‌ చేరాయి. మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.
ముంబై ఢిల్లీపై గెలిస్తే ..
ముంబై జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిస్తే.. 14పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ఓడినా.. పంజాబ్‌ ఆఖరి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడటంతోపాటు సన్‌రైజర్స్‌ చేతిలో ఆర్‌సీబీ, రాజస్థాన్‌ ఓడాలి. అలా జరిగితే ముంబై, పంజాబ్‌, బెంగళూరు, రాజస్థాన్‌ జట్లు 12 పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తాయి. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా డిపెండింగ్‌ ఛాంపియన్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
పంజాబ్‌ ప్లే ఆఫ్‌ చేరాలంటే..
పంజాబ్‌ జట్టు ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైపై గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ఢిల్లీ ముంబైని ఓడించడంతోపాటు.. సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ చేతుల్లో బెంగళూరు ఓడాలి. మిగతా మూడు జట్లు 12 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. పంజాబ్‌ ప్లేఆఫ్‌ చేరుతుంది.
రాజస్థాన్‌ టాప్‌-4లో నిలవాలంటే..
రహానే నాయకత్వంలోని రాజస్థాన్‌ చివరి మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి.. ముంబై చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆ జట్టు ప్లేఆఫ్‌ చేరుతుంది.
బెంగళూరు.. రెండు మ్యాచ్‌లూ గెలవాల్సిందే..
పంజాబ్‌పై భారీ తేడాతో గెలుపొందిన బెంగళూరు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. గురువారం సన్‌రైజర్స్‌పై, శనివారం రాజస్థాన్‌పై గెలిస్తే.. కోహ్లి సేన ఖాతాలో 14పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ముంబై లేదా కోల్‌కతా జట్లలో ఒకటి లేదా ఆ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడాలి.
కోల్‌కతా ప్లేఆఫ్‌ చేరాలంటే..
ముంబై జట్టు పంజాబ్‌పై గెలవడంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్‌తో శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తే 16పాయింట్లతో ఆ జట్టు ప్లే ఆఫ్‌ చేరుతుంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు ఓడి.. ముంబై, బెంగళూరు జట్లు తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే మాత్రం రన్‌రేట్‌ మెరుగ్గా లేని కోల్‌కతా కథ ముగిసినట్టే.