ఉపసర్పంచ్ ప్రేమించి మోసం చేశాడంటూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన యువతి.
పోటో: పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన యువతి.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణం కాంట్రాక్టు బస్తీకి చెందిన యువతి తనను సోమగూడెం ఉపసర్పంచ్ ఆరేపల్లి ప్రవీణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, న్యాయం చేయాలని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం బైఠాయించింది. ఈసందర్భంగా బాధిత యువతి మాట్లాడుతూ సోమగూడెం ఉపసర్పంచ్ ఆరేపల్లి ప్రవీణ్ నా స్నేహితుల ద్వారా నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసి నాతో పరిచయం పెంచుకొని తర్వాత కొన్ని రోజులకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పగా అతని మాటలు నమ్మి నేను కూడా అతని ప్రేమను అంగీకరించడం జరిగింది. తర్వాత ఒకరోజు ప్రవీణ్ తన పుట్టినరోజు అని చెప్పి హైదరాబాద్ లో అతను ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని. ఆ సమయంలో తనకు తెలియకుండా తన నగ్న ఫోటోలు, నగ్న వీడియోలు చిత్రీకరించాడని, ఆ తరువాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో ఈ విషయం ప్రవీణ్ కు తెలుపగా అబార్షన్ చేయించుకోమన్నాడని తెలిపింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విషయం మా ఇంట్లో చెప్పగా ప్రవీణ్ ను పిలిపించి మాట్లాడారని, అప్పుడు పెళ్లి చేసుకుంటానని మా ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పిస్తానని మాట దాటవేయడంతో వాళ్ళ ఇంటికి వెళితే ప్రవీణ్ వాళ్ల తల్లిదండ్రులు పట్టించుకోలేదని, ప్రవీణ్ వాళ్ల ముందే నన్ను కొట్టినా అడ్డుకొకపోగా నన్ను చంపమన్నారని, నువ్వు చస్తే ఏ భాద ఉండదన్నారు. తరువాత కూడా చాలా సార్లు మాయమాటలు నన్ను లోబరుచుకున్నాడని, అలా నాతో ప్రెగ్నెన్సీ పోయే మాత్రలు బలవంతంగా వేపించి ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అయ్యాడని, తన నగ్న ఫోటోలు, నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని చెప్పి పలు మార్లు అనుభవించడమే కాకుండా ఇప్పటి వరకు తనను బెదిరించి ₹ 20 లక్షల వరకు వసూలు చేశాడని ఆరోపించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకు అందజేశానని తెలిపింది. తనని పెళ్లి చేసుకోవాలని అడిగినా, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినా చంపేస్తానని, శవం కూడా దొరకకుండా చేస్తానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని, తన డబ్బులు తనకు ఇప్పించాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్లు తెలిపింది.