చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిలో సామర్థ్యం పెంపొందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , అక్టోబర్ 20.
  చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి  సామర్ధ్యాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
గురువారం బొమ్మరాసిపేట  మండలం, చౌదర్పల్లి గ్రామంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలలో చదువుతున్న పిల్లలను మన పిల్లలుగా భావించి మంచి విద్యను బోధించాచాలన్నారు.  చదువులో వెనుకబడిన విద్యార్థులకు గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం కింద ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజువారీ తరగతులతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన కలెక్టర్ వెంటనే ఏఎన్ఎంలను పిలిపించి వారికి ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి నెల వేయించాలని పాఠశాల అధ్యాపకులకు సూచించారు.  ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు సరిగ్గా వస్తున్నారా లేదా అని  వారి హాజరు వివరాలను అడిగి  తెలుసుకోన్నారు. ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న సిలబస్ ప్రకారం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు, పాఠశాలకు పుస్తకాలతో రాకపోవడంతో, వారు ప్రతిరోజు పుస్తకాలతో సహా  పాఠశాలకు రావాలని సూచించారు. తిరిగి పాఠశాలకు  వస్తానని, ఇప్పటివరకు వారి విద్యలో పురోగతి కనిపించాలని కలెక్టర్ అధ్యాపకులను సూచించారు. పాఠశాలలో అందిస్తున్న విద్య పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు ప్రహరీ గోడ మరియు కిచెన్షెడ్ ల నిర్మాణపు పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు గ్రామంలో పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీలను కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తపరిచారు. నర్సరీలో పిచ్చిగా మొలచిన గడ్డిని వెంటనే తొలగించి అట్టి ఫోటోలను తనకు పంపాలని గ్రామ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. డంపింగ్ యార్డ్, సెగరిగేషన్ షెడ్లను వినియోగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కృష్ణన్, ఎంపీడీవో పాండు, తహసిల్దార్ వాహేదా ఖాతూన్, ఎంపీటీసీ నారాయణరెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ, హెడ్ మాస్టర్ శ్రీహరిరెడ్డి, ఎంఈఓ రామ్రెడ్డి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.