చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటాన్ని కించపరిచడం సిగ్గు చేటు

బిజెపి నేత ప్రకాష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
– రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్
                                                                          చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 16 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చిట్యాల ఐలమ్మ,దొడ్డి కొమురయ్య పోరాటాలను కించపరిచిన బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యాన్ని, త్యాగాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కీర్తిస్తుంటే, ప్రభుత్వాలు గుర్తించి తగిన గుర్తింపు గౌరవమిస్తుంటే కళ్ళుండి చూడలేని, చెవులు ఉండి వినలేని  ప్రకాష్ రెడ్డి చరిత్రహీనుడని అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలియకపోతే పుస్తకాలు చదువుకోవాలని వారన్నారు. నాడు భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, దొరల ఆగడాలకు, నైజాం, రాజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని అన్నారు. పోరాటాన్ని కించపరిస్తే సహించేదిలేదని అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
Attachments area