ఛలో అసెంబ్లీని జయప్రదం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): యుఎస్ పిసి ఆధ్వర్యంలో రేపు  నిర్వహించనున్న ఛలో అసెంబ్లీని విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఆదివారం టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆ సంఘ సూర్యాపేట డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాధించుట కొరకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.17 ఏళ్లుగా మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం వలన పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడి, నాణ్యమైన విద్య అందడం లేదని పేర్కొన్నారు.ఉన్నత పాఠశాలల్లో వేలాదిగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్న కారణంగా విద్యార్థులు వివిధ విషయాలలో వెనుకబడుతున్నారని వాపోయారు. 317 జీవో అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.పాఠశాలల్లో  వెంటనే సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య , కోశాధికారి వెంకటయ్య , జిల్లా కార్యదర్శులు ఎస్ కె సయ్యద్ , యాకయ్య , వీరారెడ్డి , వెంకన్న , అనిల్ కుమార్, రమేష్ , శ్రీనివాసచారి, సీనయ్య , బాలాజీ , శేఖర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.