‘శతఘ్ని’ విడుదల
– ఆవిష్కరించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్, ఆగస్టు2(జనం సాక్షి) : జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పక్ష పత్రిక ‘శతఘ్ని’ని విడుదల చేశారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుందని ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు. జనసేన సంకల్పం గురించి ప్రతి పాఠకుడికి తెలియచేసేలా శతఘ్ని పత్రిక ఉండబోతుందని నేతలు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బలమైన సిద్దాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన అన్నారు. టీడీపీ, వైసీపీలకు సిద్దాంతాలు లేవని, అధ్యక్షులు పవన్ ఏడు సిద్దాంతాలను మనకు అందించారన్నారు. అవినీతిరహిత సమాజం స్థాపనే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుందన్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన విషయాలను తెలియచేసేందుకు ‘శతఘ్ని’ పేరుతో పక్ష పత్రికను తీసుకువస్తున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులకు డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ లక్ష్యంగా నిర్ణయించామని, అలాగే ఈ నెలలోనే ‘వాడవాడ జనసేన జెండా’ అనే కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం, గ్రామం, బూత్ స్థాయిలో జనసేన జెండా ఎగిరేలాముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం పాల్గొన్నారు.




