జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 18 (జనం సాక్షి);

ఎలాంటి వారసత్వ రాజ్యపరిపాలన లేని వ్యక్తి కేవలం స్నేహితులు తో మొదలై వేల సంఖ్యలో స్వంతంగా సైన్యం ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అందరికీ ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాకుండా పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సాధారణ వ్యక్తిగా ఉంటూ తనకు ఎదురైన అణిచివేతలను ఎదుర్కొంటు తానే సైన్యం ను తయారు చేసుకొని దొరల గడిలను, భూస్వామ్య గుత్తాదిపత్యాన్ని అణిచివేసిన బహుజనుడని, మొఘల్ సామ్రాజ్యాన్ని సైతం ఎదిరించి 20 కోటలను జయించడం తో పాటు గోల్కొండ కోట పై బహుజన రాజ్య స్థాపన జెండా ఎగురవేసిన వ్యక్తి పాపన్న గౌడ్ అని అన్నారు. భావితరాలకు పోరాట స్పూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘన కీర్తిని సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ . ఓ సతీష్ కుమార్, డిసి ఆర్బి ఇన్స్పెక్టర్ రామ స్వామి, ఎస్సై రామ కృష్ణ,సుపరిండెంట్ నయీమ్, ఐటీ సెల్, డీసీ ఆర్బీ, ఎస్బి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.