డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ

పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ”ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు మెడికల్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారు. దీనికి అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతుతో హర్షం వ్యక్తం చేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. వారు కాలం చేసిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా పేరును నామకరణం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవంతో ‘డాక్టర్’ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అదే పేరును మార్చటం దురదృష్టకరం. వారు ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లే.
అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మహా నాయకుడు, తెలుగు ముద్దు బిడ్డ మన ఎన్టీఆర్. వారి పేరు, డాక్టర్ ఎన్టీఆర్ సీఎఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కొనసాగించాలి” అని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.