Tuesday, 3 November 2026

తెలంగాణ కేబినేట్‌ ముందస్తు వరాలు

బిసిలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు

71 ఎకరాల్లో 71 కోట్లతో ఆత్మగౌరవ భవన నిర్మాణం

అర్చకుల పదవీవిరమణ 65 ఏళ్లకు పెంపు

ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6వేల నుంచి 7500లకు పెంపు

రెడ్డి హాస్టల్‌ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు

మరోమారు కేబినేట్‌ ఉంటుందని మంత్రుల వెల్లడి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వరాలను ప్రకటించింది. ఆదివారం సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముందస్తు సంకేతానలు మరింత ధృడపరచింది. అంతేగాకుండా ఈ సమావేశంలో కీలకాంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌,మంత్రి హరీష్‌ రావు, కడియం శ్రీహరిలు మాట్లాడుతూ కేబినేట్‌ నిర్ణయాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి ఈటెల వెల్లడించారు. 71 ఎకరాల్లో చేపట్టే ఈ నిర్మాణాల కోసం రూ.71కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గోపాల మిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమంపై కేబినెట్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అర్చకులకు జీతభత్యాలు ప్రభుత్వ పరంగా చెల్లించాలని నిర్ణయించారు. ఎన్‌యూహెచ్‌ఎంలో పనిచేస్తున్న 9వేల మందికి కనీస వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్‌ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్‌ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు. మిడ్‌ మానేరుకు గండి వల్ల నష్టపోయిన మన్వాడ బాధితులకు పరిహారం చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ. 4.25 లక్షల చొప్పున రూ. 25.84 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. త్వరలోనే మరోసారి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఆ కేబినెట్‌ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని కడియం స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరుకావడం లేదు. తనతోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకావడం లేదని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి మహేందర్‌రెడ్డి ఫోన్‌ చేశారని.. ప్రగతి నివేదన సభాప్రాంగణం వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం కల్పించాలని కోరారని కేటీఆర్‌ తెలిపారు. దీంతో తమకు మంత్రివర్గ సమావేశం నుంచి మినహాయింపు లభించిదని తెలిపారు. ఎన్నికలెప్పుడు వచ్చినా శ్రేణులను సమాయత్త పర్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని అన్నారు. తమ అంచనాలకు మించి సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.