Friday, 6 November 2026

నామినేషన్ల సందడి

రాష్ట్ర వ్యాప్తంగా తెరాస కాంగ్రెస్‌ అభ్యర్ధుల నామినేషన్లు

రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన నాయిని రాజేందర్‌ రెడ్డి

పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్‌ దాఖలు

హైదరాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కాగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మరోవైపు స్వతంత్య్ర అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా తెరాసలో నామినేషన్ల సందడి నెలకొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావులతో సహా పలువురు కీలక నేతలు తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ బరిలోకి దిగారు. ఆయన తన నామినేషన్‌ పత్రాల్ని గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. కేవలం రెండు వాహనాల్లో కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానికులతో కలిసి మధ్యాహ్నం 2.34 నిమిషాలకు నామినేషన్‌ దాఖలు చేశారు. నకలు కాపీలను వెంట తీసుకెళ్లక పోవడం, కాన్వాయ్‌లోని మరో వాహనంలో నామినేషన్‌ రెండో సెట్టు ఉండటంతో దానిని అప్పటికప్పుడు కార్యాలయానికి రప్పించారు. అదేవిధంగా సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మంత్రి, తెరాస నేత హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ముందు ఆయన ఈద్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విూ ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థిని చూసి ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు.

అదేవిధంగా భూపాలపల్లి నుంచి తెరాస అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తన స్వగ్రామం నర్సక్క పల్లెలో ఆయన తన తల్లితండ్రుల చిత్ర పటలకు

నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా చెన్నూరులో ఎంపీ బాల్కసుమన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మరో ఎంపీ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. తాండూరులో తెరాస అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి, పరిగిలో తెరాస అభ్యర్థి కొప్పుల మహేష్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నిజామాబాద్‌ ఎంపీ కవితతో కలిసి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తొలుత ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయాలని అనుకుని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత సమయం చాలక నేరుగా మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి విద్యాసాగర్‌రావు నామినేషన్‌ పత్రాలను కవిత సబ్‌కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా చెరకు రైతులు ఎంపీ కవితను అడ్డుకునేందుకు సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి కొద్ది దూరంలో జాతీయ రహదారిపై వేచి చూశారు. ఇంతలో ఆమె కారు జగిత్యాల వైపు వెళ్లి పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెనుదిరిగారు. జడ్చర్లలో తెరాస అభ్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌ గౌడ్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం, చర్చి, షాసాహెబ్‌ గుట్ట దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్చంపేటలో తెరాస అభ్యర్థి గువ్వల బాలరాజు, దేవరకద్రలో తెరాస అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, మక్తల్‌లో తెరాస అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, గద్వాలలో తెరాస అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెరాస అభ్యర్ధి పిడమర్తి రవి నామినేషన్‌ దాఖలు చేశారు. వేములవాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా చెన్నమనేని రమేష్‌బాబు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతుకు ముందు ఆయన వేముల వాడ ఆలయంలో పూజలు నిర్వహించారు. గోషామహల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ముఖేష్‌గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు మంచిగా ఉండటం వల్ల నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. పటాన్‌చెరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశికళ యాదవరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మహాకూటమిలో భాగంగా పటాన్‌చెరు టిక్కెట్‌ ఏ పార్టీకి కేటాయించినా వారి విజయం కోసం కృషి చేసేవారిమని ఆమె అన్నారు. నేడు మంచి రోజు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసినట్లు శశికళ యాదవరెడ్డి తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నాయని రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీ తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిందని, టీడీపీకి కేటాయించడం సరికాదన్నారు. తన పేరును ఇప్పటికైన ప్రకటించాలని ఆయన కోరారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కె.కె. మహేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆందోల్‌ బీజేపీ అభ్యర్ధి బాబూమోహన్‌ ఒకసెట్‌ నామినేషన్‌ను బుధవారం దాఖలు చేశారు. ఆందోల్‌లోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.