ప్రత్యక్ష సాక్ష్యులు లేకుండా దిశ కేసు కదిలేనా
ఎన్కౌంటర్తో పెరుగుతున్న అనుమానాలు
హైదరాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): దిశ హత్యాచార కేసులో నిందితులను అసలు ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న విషయంలో మరో కోణం బయటికొచ్చింది. ఎన్కౌంటర్ జరక్కపోతే శిక్ష పడడం అనుమానమేనన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, సంఘటనలో బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇది కోర్టులో నిలబడడం కష్టంగా మారనుంది. నిందితులే నేరం చేశారనేందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఏవీ లేవు. దిశ శరీరం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షతో సరిపోల్చడం కూడా సాధ్యం కాదు. తామే నేరం చేశామన్న నిందితుల వాంగ్మూలానికి చట్టం ముందు విలువుండదు. పోలీసులు చంపుతామని బెదిరించ డంతో తామలా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెబుతారు నిందితులు. ఈ నేపథ్యంలో ఈకేసును అన్ని ఆధారాలతో రుజువు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేకుండా పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా శిక్ష పడే అవకాశం లేదు. అత్యాచారం జరిగినట్లు రుజువు చేయాలంటే ముందు నిందితులకు వైద్యపరీక్షలు చేయాలి. వారి దుస్తులు సేకరించాలి. వాటిపై వీర్యం, రక్తం మరకలు ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపి నిర్థారించాలి. పోలీసులు ఇక్కడ ఆ ఆధారాలు సేకరించినట్లు కన్పించడంలేదు. ఈ కేసులో ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఎన్ కౌంటర్పై ప్రజలు ఇలా స్పందిస్తారని తాము అస్సలు ఊహించలేదని పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యా
నించారు. ప్రజల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉండటానికి కారణం.. జరిగిన హత్యాచారం తమ సొంతవారికి జరిగినట్లుగా ప్రజలు భావించటమేనని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ కేసులో అయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ప్రజలకు ఎప్పటికైనా న్యాయం చేసేది పోలీసులే అని సీనియర్ పోలీస్ అధికారులు వ్యాఖ్యానించారు. దిశ ఘటన జరిగిన రోజున అందరూ పోలీసులపై దుమ్మె త్తి పోశారు. ఇదంతా పోలీసు వైఫల్యంగా వ్యతిరేక దూషణలు చేశారు. ఎన్కౌంటర్ తర్వాత సామాన్యుల నుంచి పెద్దల వరకూ అంతా పోలీసుల్ని పొగుడుతున్నారు. ఇది సరికాదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ఎన్కౌంటర్తో ఏదో సాధించామని భావించటం పొరపాటే.. తమపై దారుణాలకు ఒడిగట్టిన నిందితులకు సకాలంలో శిక్ష పడటం లేదన్న సామాన్యుల ఆగ్రహమే ఎన్కౌంటర్ తర్వాత పోలీసులపై పూలు జల్లేలా.. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకునేలా చేసింది. ఉద్రేకంతో కూడిన భావోద్వేగం ఏ మాత్రం మంచిది కాదన్నారు.




