పేదలకు చేరువగా సర్కార్‌ విద్య: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌30(జ‌నం సాక్షి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మైనారిటీ వర్గాల్లోవిద్యాభ్యాసం లేక అభివృద్ధి చెందడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని గమనించి దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకంగా మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేశామని, ఇటీవల 119 బీసీ గురుకులాలను ప్రారంభించి వెనుకబడిన బీసీలను విద్యా పరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాలయాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హావిూలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో విద్యారంగంలో ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు మంజూరు చేసి ప్రారంభించిన ఘనత లేదన్నారు. మానవ అభివృద్ధి సూచికల్లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని అందుకే రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకు మూడేళ్లుగా సుమారు ఐదు వందల గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పేద విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వచ్చే నోటిఫికేషన్లలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు.