– సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు
– మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు
– ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలి
– హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆడియో సందేశం
హైదరాబాద్, మే9(జనం సాక్షి) : పోలీసు అధికారులు సివిల్ తగాదాల్లో తల దూర్చడంపై హైదరాబాద్ నగర
పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల కిందట ఓ జంట తనను సంప్రదించి చెప్పిన వివరాలు కలిచివేసేలా ఉన్నాయంటూ సీపీ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. గతకొన్ని రోజులుగా విూడియాలో వస్తున్న వార్తలను, తనతో సంప్రదించిన బాధితుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై సీపీ అంజనీకుమార్ ఆడియో సందేశాన్ని విడుదల చేసి, దిశానిర్దేశర చేస్తున్నారు. అందులో భాగంగా మూడు నిమిషాలకు పైగా నిడివి కలిగిన ఆడియో సందేశాన్ని బుధవారం విడుదల చేశారు.
ఈ నెల ఏడో తేదీ రాత్రి భార్యాభర్తలు తన వద్దకు వచ్చి క్షేత్ర స్థాయిలో వారి పట్ల పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు వివరించడంపై సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ తగాదాలో వారిని అదుపులోకి తీసుకుని లాకప్‌లో ఎందుకు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇదే అంశంపై అధికారుల పేర్లు, స్టేషన్ వివరాలు బహిర్గతం చేయకుండానే ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. సివిల్ తగాదాలో ఓ వ్యక్తిని తీసుకొచ్చి లాకప్‌లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకోడానికి స్టేషన్‌కు వచ్చిన ఆయన భార్య పట్ల కూడా మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుగా ఉండి ఒకరికి మద్దతు ఇవ్వడం.. మరొకరిని బాధితులుగా భావించి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసు శాఖ పరువు, ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని…ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని సూచించారు.




