పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని టేకుమట్ల గ్రామ సర్పంచ్ పద్మ నాగేందర్ , డాక్టర్ కుసుమ అన్నారు.మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో అంగన్వాడీ మూడవ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం అవగాహన సదస్సులో వారు పొల్గొని మాట్లాడారు.పోషణ మాసోత్సవాలలో భాగంగా నెల రోజులపాటు గ్రామస్థాయిలో పోషకాహార విలువలపై గర్భిణీలు , బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కుసుమ మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు,ఆరేళ్లలోపు చిన్నారులకు రక్తహీనత సమస్య నుండి కాపాడేందుకు వైద్య శాఖ సమన్వయంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రతీ నెల మొదటి వారంలో అంగన్వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఎత్తు,బరువుల కొలతలు తీసి పోషణ లోపమున్న పిల్లలను గుర్తించి , సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు విటమిన్లు, మినరల్స్, అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరసింహ రావు, అంగన్వాడి టీచర్ కె.వసంత, ఆయా సైదమ్మ , ఆశ వర్కర్ కె.ప్రమీల,తల్లులు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.