Tuesday, 3 November 2026

బిస్వాల్‌ కమిటీ నివేదిక బుట్టదాఖలు

ఖాళీల విషయంలోనూ ఇంత మోసమా
ఉద్యోగా లప్రకటనపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ బిస్వాల్‌ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు చెప్పిందన్నారు. కానీ కేవలం 80వేల ఉద్యోగాల ప్రకటనతో మరోమారు మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి క్యాలండర్‌ ఏడాది వెనకబడిరదన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూపులు చూపి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయడంలో వెనకంజ వేశారని అన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు నెట్టి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. అదనపు జిల్లాలతో అదనపు ఉద్యోగాలు ఎందుకు క్రియేట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు, రిటైర్‌మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమా? అన్నారు. కేవలం 13 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఇంత ఆర్భాటమా?.. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. స్థానికత పట్ల చిత్తుశుద్ధి ఉంటే ప్రైవేట్‌లో కూడా స్థానికులకే అవకాశం దక్కేలా చూడాలన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ప్రకటించాలన్నారు. ఉపాధి హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని, కనీసం టెట్‌ కూడా ప్రభుత్వం నిర్వహించలేదని జీవన్‌ రెడ్డి దుయ్యబట్టారు.