Tuesday, 3 November 2026

మఠంపల్లి ఘటనపై ఎంపి ఉత్తమ్‌ ఆగ్రహం

బాధితులను పరామర్శించిన ఉత్తమ్‌
సూర్యాపేట,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : మఠంపల్లి మండలం గుర్రంపోడుతండాలో ఇటీవల టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన మూడవథ్‌ శీను కుటుంబ సభ్యులను ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకుల భూకబ్జాలకు అడ్డుకుంటు న్నారని.. అమాయక గిరిజనులపై స్థానిక ఎంపీపీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంపీపీ స్వయంగా దాడి చేసి పది రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్‌ఐ, సీఐ, డీడిఎస్పిలు స్థానిక ఎమ్మెల్యేలకు లక్షల లంచం ఇచ్చి పోస్టులు తీసుకుంటున్నారన్నారు. పోలీసు వ్యవస్థలో పారదర్శకత లేకుండా పోతోందని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. మఠంపల్లి ఎస్‌ఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎంపీ డిమాండ్‌ చేశారు.