4794 టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
ఉద్యోగార్థుల వయోపరిమిత పదేళ్లు సడలింపు
స్థానిక రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్,మార్చి9(జనం సాక్షి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పక్రియను త్వరలోనే చేపడుతామని సీఎం శాసనసభా వేదికగా ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగు తుందన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్`1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ నియామకాల భర్తీపై శాసనసభ వేదికగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా పలు విషయాలను వెల్లడిరచారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కేసీఆర్ తెలిపారు. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సిటివో, ఆర్‌టీవో, డిస్టిక్ట్ రిజిస్టార్ర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చామని కేసీఆర్ ప్రకటించారు.
గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అని సీఎం పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్ లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.




