రక్త దానం మరొకరికి ప్రాణదానం
రక్త దాతలకు అభినందనలు
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో రక్తదాతలు ముందుకొచ్చి రక్త దానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ , మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో కలిసి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరంలో రెండు సార్లు రక్త దానం చేయవచ్చు అని అన్నారు.రక్తదానంతో ఆపదలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు.సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి , కోదాడ హుజూర్ నగర్,తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 300 వందలకు పైగా రక్త దాతలు ముందుకొచ్చి రక్తాన్ని అందించారని, వైద్యులతోపాటు వారిని అభినదించారు.ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, వైద్యులు, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.